ఆత్మకూరు ఉపఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తం అయి వుంది. నెల్లూరుపాళెంలోని ఆంధ్రా ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది కౌంటింగ్. ఆత్మకూరు ఉప ఎన్నికల కౌంటింగ్ కు విస్తృతంగా ఏర్పాట్లు చేసింది ఈసీ. పటిష్టమైన పోలీస్ భద్రత వలయంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మధ్యాహ్నానికి ఫలితాలు తేలిపోనున్నాయి. మొదట పోస్టల్ బ్యాలెట్ ..అనంతరం ఈ.వి.ఎం.లలోని ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఆత్మకూరు నియోజకవర్గంలో ఆరు మండలాలు వుండగా, మొత్తం రెండు లక్షల 13 వేల 338 మంది ఓటర్లు ఉన్నారు. పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా వుండడం విశేషం, మహిళా ఓటర్లు లక్షా 7 వేల 367 మంది ఉంటే పురుష ఓటర్లు లక్షా 05 వేల 960 మంది ఉన్నారు. 2019 సాధారణ ఎన్నికలతో పోలిస్తే 18.18 శాతం ఓటింగ్ శాతం తగ్గింది. 2019లో 82.44 శాతం పోలింగ్ నమోదవ్వగా ఉపఎన్నికల్లో 64.26 శాతం పోలింగ్ నమోదు అయింది. గతంతో పోలిస్తే పోలింగ్ శాతం బాగా తగ్గింది. ఎన్నికలలో ఓటు హక్కును లక్షా ముప్పై ఏడు వేల ఎనభై ఒకటి మంది వినియోగించుకున్నారు. 14 టేబుళ్ల తో 20 రౌండ్స్ ద్వారా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్నవారికే అనుమతి వుంటుందని అధికారులు తెలిపారు. ఏజెంట్లు 6 గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.