పెగాసెస్ పై అసెంబ్లీ హౌస్ కమిటీ తొలి సమావేశం జరిగింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను చట్ట విరుద్ధంగా వినియోగించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గత మార్చిలో హౌస్ కమిటీ వేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన ఇవాళ సమావేశం అయింది హౌస్ కమిటీ. రేపు హోం తదితర శాఖల అధికారులతో సమావేశం కానుంది హౌస్ కమిటీ.
టీడీపీ హయాంలో పెగాసెస్ నిఘా పరికరాలను వినియోగించారన్న ఆరోపణలపై ఏర్పాటైన ఏపీ అసెంబ్లీ హౌజ్ కమిటీ విచారణలో వేగంపెంచింది. విపక్ష నేతల కదలికలపై నిఘా పెట్టేందుకే టీడీపీ ప్రభుత్వం పెగాసస్ పరికరాలను వినియోగించిందన్న వార్తలపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భారీ రచ్చ జరిగింది. అయితే తామేమీ ఈ పరికరాలను వాడలేదని, అసలు వాటిని కొనుగోలే చేయలేదని టీడీపీ వాదించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ హౌజ్ కమిటీని నియమించింది.
ఈ కమిటీ మంగళవారం అమరావతిలోని అసెంబ్లీలో తొలిసారి భేటీ అయ్యింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించింది కమిటీ. హౌస్ కమిటీ విచారణలో భాగంగా రేపు హోం శాఖ సహా వివిధ శాఖల అధికారులను విచారించనుంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న పలు శాఖల అధికారులను విచారించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా శాఖలకు కమిటీ లేఖలు రాసింది. ఆయా ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం సేకరించనున్న కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. అసలు పెగాసెస్ వ్యవహారంలో ఏం జరిగిందనేది త్వరలో తేలనుంది.