ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాల్లో ఎంత బిజీగా వున్నా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మాత్రం ఆయన తన స్టయిల్ చూపిస్తారు. తాజాగా ఆయన చేతిలో చిడతలు, తుంబుర పట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. ఇవాళ పూణేలో పర్యటించిన మోడీ డెహూ ప్రాంతంలో సంత్ తుకారామ్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు సంత్ తుకారామ్ పేరిట ఈ ఆలయం నిర్మించారు.
ఈ ఆలయంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ పాలకమండలి సభ్యులు ప్రధాని మోడీకి తుంబుర, చిడతలు బహూకరించారు. తుంబుర చేతబూనిన ప్రధాని మోదీ చిడతలను వాయించారు. సంత్ తుకారామ్ అభంగ పేరిట భక్తి సాహిత్యాన్ని లిఖించారు. అనేక కీర్తనలను రచించారు. ఆయన మరణానంతరం చిన్న శిల్పమందిరం ఏర్పాటు చేసినా, ఇటీవల దానికి ఆలయ రూపు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొన్నారు. మోడీ సంప్రదాయ వస్త్రధారణలో అలరించారు. మోడీ ఏం చేసినా అది వెరైటీగా వుంటుందని నెటిజన్లు, బీజేపీ కార్యకర్తలు కామెంట్లు చేస్తున్నారు.