అవినీతి కేసులో తండ్రి అరెస్ట్‌తో కలత చెంది కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పంజాబ్‌లోని చండీగఢ్‌లో జరిగింది. ఐఏఎస్ అధికారి సంజయ్ పొప్లీ అవినీతి కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇది కొడుకును తీవ్రంగా కలచివేసింది. ఆ మనస్తాపంతోనే తండ్రి తుపాకీ తీసుకుని కాల్చుకున్నాడు. సంజయ్ పొప్లీ పంజాబ్‌లో 2008 బ్యాచ్‌కి చెందిన ఓ ఐఏఎస్ అధికారి కాగా.. ఆయనను అవినీతి కేసులో ఇటీవల పంజాబ్ విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నాడు. రిమాండ్ గడువు ముగుస్తుండటంతో విజిలెన్స్ అధికారులు మరోసారి చండీగఢ్‌లోని పొప్లీ ఇంటికి బయలుదేరారు. విజిలెన్స్ బృందం పొప్లీ ఇంటికి చేరుకోగానే కాల్పుల శబ్దం వినిపించింది. లైసెన్స్ ఉన్న తుపాకీతో కార్తిక్ తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్నారు.
ఈ విషాద ఘటనతో పొప్లీ కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్ అధికారులే తన కుమారుడిని పొట్టన పెట్టుకున్నారని కార్తిక్ తల్లి ఆరోపించారు. తండ్రి అవినీతి ఆరోపణలతో అరెస్ట్ కావడంతో కార్తిక్ కలత చెంది ప్రాణాలు తీసుకున్నాడని అధికారులు భావిస్తున్నారు. అయితే మృతుడి కుటుంబీకులు మాత్రం ఇది హత్యేనని ఆరోపిస్తున్నారు. పోలీసులు తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఐఏఎస్ భార్య పేర్కొన్నారు. వారు నమోదు చేసిన కేసుకు మద్దతుగా తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వాలని తమ ఇంట్లోని పనివాళ్లపైనా ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ‘విజిలెన్స్ అధికారులే నా కుమారుడిని చంపేశారు. దీనికి సీఎం భగవంత్ మాన్ సమాధానం చెప్పాలి. దీనిపై నేను కోర్టుకు వెళ్తా’నంటూ ఆమె కన్నీరుమున్నీరయ్యారు. కార్తీక్ ఉపయోగించిన గన్ తండ్రి పొప్లీదే. ప్రభుత్వ ప్రాజెక్టులో కమీషన్ డిమాండ్ చేశాడంటూ పొప్లీపై స్థానిక కాంట్రాక్టర్ కొన్నాళ్ల క్రితం యాంటీ కరప్షన్ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. లంచం డిమాండ్ చేసిన ఫోన్ రికార్డింగ్‌లను కూడా అందజేశాడు. ఈ మేరకు పొప్లీని అధికారులు అరెస్ట్ చేశారు.